ఏమీ తోచని క్షణాలు
- Mast Culture

- Jul 9, 2025
- 1 min read
By Hemant Kartheek Chintha
ఎవరో వస్తారని
ఏదో చేస్తారని
ఎదిగిన ఆశలు కాదు నావి
వేసిన అడుగులు కావు యివి.
ఎవరో చెప్పారని
ఏదో ఇచ్చేస్తారని
ఎదను కాదని ఆగిపోను
ఏడుస్తూ అపజయాన్ని అందుకోను.
మోసపోతూ అలసిపోయానో
అలసిపోతూ అలుసయ్యానో
కలల కన్నులు కరుగుతున్నాయో
కాలం కలసిరాక కదులుతున్నాను.
ఆలోచనలు రగులుతున్నాయి
ఆచరణలు అడుగుతున్నాయి
ఆవేశాలు అరుగుతున్నాయి
ఆరాటంగా మరుగుతున్నాయి.
కవితలు కావు ఇవి...
కల్పిత గాథలు కానేకావు.
బాధలు కావు ఇవి...
బంధించిన బాధ్యతా భయాలు.
అబద్దంలో అలవాటుగా బ్రతుకుతున్న
మనలోంచి నన్ను క్రూరంగా లాగేసి,
నిజాల నీడలు నిలువునా నరికిన
మాంసపు ముద్ద నా మౌనం!
నడక రాక కాదు...
పారే నదులన్నీ ఉరికేది.
నిదుర రాక కాదు...
వీచే గాలులన్నీ ఉసురేది!
చావు రాక కాదు...
చచ్చే పిరికోళ్ళు ఉరేసుకునేది.
బ్రతుక రాక కాదు...
నాలాంటోళ్లంతా ఊరికే ఉండేది!
చీకటిని చీల్చే వెలుగైనా,
చిటికేస్తే వచ్చే శబ్దమైనా,
చిక్కగా కుట్టే చిరు చీమైనా,
చేరాల్సిన చివరి చిరునామా ఒక్కటేగా!!
ఏదీ శాశ్వతం కాని యీ సృష్టిలో,
ఏదో సాధిద్దాం అనే నా ఆశలో,
ఏదొకటి చేసేస్తూ, స్వలాభంతో బ్రతికేస్తూ,
ఏదో సాధించేసాం అని చెప్పుకునే వాళ్లంతా...
చెప్పులదండతో ఊరేగించే చెత్త శవాల సమానమే!!
ఇవి ఏమీ తోచని క్షణాలు
నేను నేనుగా క్షామమై...
నన్ను నేరుగా క్షీరమై...
కరిగించుకున్న కన్నీటి క్షణాలు!!
గమ్యం కోసం, గమనం కోసం,
గతి తోచని గాత్ర నేత్రం నా కోసం,
గగనం కోసం చూపులు ఛిద్రమై,
మెరుపుల్లా మెరిసిన క్షణాలు!!
By Hemant Kartheek Chintha



Comments