ప్రాణవి
- Mast Culture

- Jul 9, 2025
- 1 min read
By Hemant Kartheek Chintha
కవులు రచించడానికి పుట్టిన అందం నువ్వు
శిల్పులు చెక్కడానికి కదిలిన శిల నువ్వు
సురులు మోహించడానికి మెరిసిన మెరుపు నువ్వు
అసురుల సంహారనికై అల్లిన ఆయుధం నువ్వు.
అందమైన మనసుకు అమృతం నీవు
అందరికీ అందని ఆకాంక్ష నీవు
అప్పుడప్పుడు మోయలేని ఆవేదన నీవు
అక్కడక్కడా మాయమయ్యే అన్వేషణ నీవు.
కళ్ళు ఓర్చుకోలేనంతగా విరిసిన కళ నువ్వు
రెప్పలు వాల్చలేనంతగా విసిరిన వల నువ్వు
చూపుల్ని ముంచడానికి ఎగసిన అశ్రుఅల నువ్వు
గుండెల్ని నింపడానికి ఎదిగిన బరువైన వెల నువ్వు.
సాగరమథనానంతరం వచ్చిన మోహినీ నీవు
కృష్ణావతారానికి ముందు పలికిన ఆకాశవాణి నీవు
కలియుగారంభానికి కారణం అశ్లీల అత్యాశ నీవు
భూత ప్రేత పిశాచాల వలయం అత్యంత ఆకర్షణ నీవు.
ప్రకృతి పెంచుకున్న అందమైన ఆకృతి నువ్వు
అందం అలంకరించుకున్న అద్వైత బంధం నువ్వు
అద్వైతం సృష్టించుకున్న పవిత్ర స్వర్గం నువ్వు
పవిత్రత సత్కరించుకున్న సృష్టి ద్వారం నువ్వు.
ఎప్పటికీ అర్థంకాని ఏకైక అర్థం నీవు
ఎవ్వరికీ సొంతంకాని అనైక సంఖ్య నీవు
ఇప్పటికీ తీర్చలేని అనంత శోకం నీవు
ఒక్కరికీ నేర్పలేని రహస్య శ్లోకం నీవు.
మనసును దోచుకునే మోసం నువ్వు
మమతను దాచుకునే మొహం నువ్వు
మాంసానికి ప్రాణం పోసే మర్మం నువ్వు
మహర్షులనే మైమరపించే మైకం నువ్వు.
శూన్యంలో మిగిలిన సూక్ష్మం నీవు
అంతంలో ఆరంభమైన సాధ్యం నీవు
అంతరీక్షలోకపు అంతర్లీన శాస్త్రం నీవు
అంతర్యుద్ధపు విశ్రాంతికి స్త్రోత్రం నీవు.
విడదీయలేనంతగా విస్తరించిన భావోద్వేగం నువ్వు
వదులుకోలేనంతగా ఆక్రమించిన వలపు వృక్షం నువ్వు
పొగుడుకోడానికి పుట్టిన ప్రశాంత ప్రళయం నువ్వు
పాడుకోడానికి రాసిన ప్రణయ పద్యం నువ్వు.
అణువణువూ అనుభవించాల్సిన విశ్వవేదం నీవు
క్షణక్షణమూ సేవించాల్సిన అద్వైత దైవం నీవు
స్వర్గ సుఖముల మోక్ష దర్శనం విశ్వరూపం నీవు
జనన మరణ విధ్వంస మార్గము సర్వస్వం నీవు.
By Hemant Kartheek Chintha



Comments